Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 66

Janaka talks about Shivadhanush!!

|| om tat sat ||

తతః ప్రభాతే విమలే కృత కర్మా నరాధిపః |
విశ్వామిత్రం మహాత్మానం అజుహావ స రాఘవమ్||

తా|| అప్పుడు ఆ నరాధిపుడు ప్రభాతసమయమున తన ప్రాతఃకాల కర్మలను ముగించికొని మహాత్ముడైన విశ్వామిత్రుని రామలక్ష్మణులను ఆహ్వానించెను

బాలకాండ
అరువది ఆరవ సర్గ

అప్పుడు ఆ జనక మహారాజు ప్రభాతసమయమున తన ప్రాతఃకాల కర్మలను ముగించికొని మహాత్ముడైన విశ్వామిత్రుని రామలక్ష్మణులను ఆహ్వానించెను. ఆ ధర్మాత్ముడు శాస్త్రోక్తముగా వారిని పూజయించి రాఘవుడు , మహాత్ముడైన విశ్వామిత్రునితో ఇట్లు పలికెను.
"భగవన్ ! మీకు స్వాగతము . ఓ అనఘ ! మీకు ఏమి చేయగలను.మీరు ఆజ్ఞాపించుడు. నేను మీ ఆజ్ఞానువర్తిని".

మహత్ముడగు జనకుడు ఇట్లు పలుకగా ఆ ధర్మాత్ముడు వాక్య విశారదుడు అయిన ముని ఆ వీరునకు ఇట్లు ప్రతుత్తరము ఇచ్చెను. "ఈ క్షత్రియులైన దశరథపుత్రులు ఇద్దరూ లోకవిశ్రుతమైన శ్రేష్ఠమైన మీ కడనున్న ధనస్సును చూచుటకు కోరిక గలవారు . మీకు శుభమగు గాక. ఈ రాజకుమారులు ఇద్దరికీ ధనస్సును చూపించుము. దానిని చూచిన తరువాత వారి కోరిక ప్రకారము వెళ్ళెదెరు".

అప్పుడు జనక మహారాజు మహామునికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

"ఓ మహామునీ ఈ ధనస్సు ఇక్కడ యెందుకు ఉన్నదో వినుడు. పూర్వము నిమివంశమున ఆరవ చక్రవర్తి అగు దేవరాతుడు ప్రసిద్ధికెక్కిన వాడు . ఆ మహాత్ముని చేతిలో భగవంతుడు చే ఈ ధనస్సు న్యాసముగా ఇవ్వబడినది. పూర్వము దక్షయజ్ఞము నాశనమగునప్పుడు రుద్రుడు ధనస్సు తీసుకొని కోపముతో దేవతలందరికి ఇట్లు చెప్పెను. "యజ్ఞములో భాగము అడుగుచున్ననాకు భాగములను చేయకున్న మీ అందరి శ్రేష్ఠములైన శిరోభాగములను ఈ ధనస్సుతో ఖండించెదను" అని. ఓ మునిపుంగవ ! అప్పుడు దేవతలందరూ దుఃఖితులై ఆ ఈశ్వరుని ప్రార్థించిరి. ఆయన వారిపై ప్రసన్నుడాయెను. శివుడు అందరిపై ప్రేమకలవాడై ఆ మహాత్ములకు ఈ దేవ దేవుల రత్నము వంటి ధనస్సును ఇచ్చెను. పిమ్మట మా పూర్వజునికి ఈ ధనస్సు న్యాసముగా ఇవ్వబడినది".

జనకుడు మరల చెప్పసాగెను.

"ఆప్పుడు నేను ఒకసారి పొలమును దున్నుచుండగా నాగటి చాలునుండి ఒక కన్య పైకి వచ్చెను. పొలము దున్నుచుండగా దొరికినందువలన ఈమె సీతా అని పేరుతో ప్రసిద్ధి కెక్కెను. ఆ భూతలమునుంచి పైకి వచ్చిన ఆమె నా కూతురు వలె పెరిగెను. అయోనిజ అయిన ఈకన్యకు పరాక్రమమే శుల్కము. ఓ మునిపుంగవ ! భూతలమునుంచి పైకి వచ్చి పెరిగిన నా కుమార్తెను వరించుటకు చాలామంది రాజులు వచ్చిరి. ఓ భగవన్ ! నా కుమార్తెను వరించ వచ్చిన రాజులు తగుపరాక్రమశాలురు కానందువలన ఎవరికీ నేను ఇవ్వలేదు. అప్పుడు ఆరాజులందరూ కలిసి తమ పరాక్రమము పరిక్షించగోరి మిథిలానగరమునకు వచ్చిరి . వారు తమ పరాక్రమమును ధనస్సుని ఎక్కుబెట్టి పరిక్షించగోరిరి. కాని వారు ధనస్సును ఏక్కుబెట్టుటకు గాని ఎత్తుటకుకాని సమర్థులు కాలేకపోయిరి. ఓ తపోధనా ! ఆ రాజుల పరాక్రమము స్వల్పమని తెలికొని వారికి కన్యను ఇచ్చుటకు నేను సమ్మతింపలేదు. అప్పుడు జరిగిన వృత్తాంతము చెప్పెదను వినుడు".

"ఓ మునిపుంగవ ! ఆ రాజులందరికి పరాక్రమ ప్రదర్శన మిషతో తమను మేము అవమానించితిమా అని సందేహము వచ్చెను. అప్పుడు వారందరూ చాలాక్రోధముతో మిథిలానగరమును ముట్టడించిరి. అట్లు అవమానించబడినట్లు తలచిన ఆ రాజులు మిక్కిలి కోపముతో మిథిలానగరమును పీడించ సాగిరి. ఓ మునిశ్రేష్ఠ! ఒక సంవత్సరము గడిచినతరువాత మిథిలా నగరపు రక్షణ సాధనములు అన్నీ క్షీణించి పోయినవి. అప్పుడు నేను మిగుల దుఃఖితుడనైతిని. అప్పుడు నేను తపస్సుతో దేవగణములన్నిటినీ ప్రసన్నము చేసికొంటిని. పరమప్రీతులై దేవతలు నాకు చతురంగ బలములను ఇచ్చిరి. అప్పుడు రాజులందరూ భంగపడినవారై పరాక్రమ హీనులై , పాపకర్మలకు ఒడిగట్టిన వారై అన్ని దిక్కులలో పారిపోయిరి".

"ఓ మునిశార్దూల ! మంచి వ్రతములు చేసినవాడా ! అట్టి ప్రతిభావంతమైన ధనస్సును రామలక్ష్మణులకు కూడా చూపించెదను".

"ఓ మహామునీ ! ఆ ధనస్సును రాముడు ఏక్కుపెట్టగలిగినచో అయోనిజ అయిన నాకుమార్తెను దశరథ కుమారునికి ఇచ్చెదను".

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములోని బాలకాండలో అరువది ఆరవ సర్గ సమాప్తము||

||ఓమ్ తత్ సత్ ||

యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే |
సుతాం అయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహమ్ ||

" ఓ మహామునీ ! ఆ ధనస్సును రాముడు ఏక్కుపెట్టగలిగినచో అయోనిజ అయిన నాకుమార్తెను దశరథ కుమారునికి ఇచ్చెదను"


||om tat sat||